చికిత్స కంటే నివారణ మేలు

న్యూస్ లీడర్:     వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేయించుకోవడం కంటే, అది రాకుండా ముందు గానే నివారణా చర్యలు తీసుకోవడం మేలు అని జా యింట్ కలెక్టర్-2 ఆర్.కూర్మనాధ్ అన్నారు. సంపూర్ణ అవగాహనతో కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా విపత్తుల నివారణా సంస్థ, నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా కరోనా వ్యాధిపై కలెక్టరేట్ ఆడిటోరియంలో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెసి- 2 కూర్మనాధ్ మాట్లాడుతూ విదేశాల్లో పుట్టిన కరోనా వ్యాధిపట్ల మనం అంతగా భయపడాల్సిన అవసరం లేనప్పటికీ, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన వేడి వాతావరణంలో కరోనా వైరస్ ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదన్నారు. ముఖ్యంగా పదేళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఈ వైరస్ వల్ల ముప్పు ఎక్కువని చెప్పారు. వ్యాధి లక్షణాలు కనిపించినవారు, ప్రభుత్వం సూచించిన విధంగా తగిన జాగ్రత్తలను తీసుకొని ఏకాంతంగా 14 రోజులపాటు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యాధి లక్షణాలు కనిపిస్తే, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. కరోనా వైరస్ ప్రభలకుండా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, దీనికోసం ఇప్పటికే పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు. వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత కరోనాకు అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు. ఈ వ్యాధిపట్ల పూర్తిగా అవగాహన పెంచుకొని, అందరమూ కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా విపత్తుల నివారణాధికారి బి. పద్మావతి, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.కృష్ణమూర్తినాయుడు, నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్ కో-ఆర్డినేటర్ విక్రమాధిత్య, డిసిహెచ్ఎస్ నుంచి జిల్లా రేపిడ్ రెస్పాన్స్ టీమ్ సభ్యులు డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ ఆదిత్య వర్మ, ఎస్.బి. రావు, జిల్లా వైద్యారోగ్యశాఖ తరపున హెల్త్ ఎడ్యుకేటర్, ఎంపిహెచ్ ఓ ఎల్.ఎస్.నాయుడు, ఎన్డీఆర్ఎఫ్ వాలంటీర్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.